114. ప్రశ్న : రోమా 11:32లో అందరియెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు.  అంటే దేవుడే అందర్ని అవిధేయ స్థితిలో మూసేసాడా? అలా అని అర్థమవుతుంది కదా? దీని గురించి వివరించండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:       ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న అంశము దేవుని భవిష్యతు నిర్ణయమును గూర్చినటువంటి ఒక ప్రశ్న మీరు లేవనెత్తుతున్నారు. దీన్నే దేవుడు కొందరిని ఎరిగెను ఏర్పాటు చేసెను, ముందు నీతిమంతులుగా తీర్చెను.  ఎవరిని కఠినపరచ గోరుదునో వారిని కఠినపరచెదను, ఎవరిని కరుణించ గోరుదునో వారిని కరుణించెదను.  అనే ఈ వచనాలు అన్నిటియొక్క సారాంశము మీరు గ్రహించాలి.  ముందు మీరు ‘యాకోబు దేవుడు’ అనే పుస్తకం చదవండి. దేవుడు ఒక మనిషిని ఎందుకు రక్షిస్తాడు? కొంతమందిని ఎందుకు కఠినపరుస్తాడు? కొంతమంది ఎంతచెప్పినా సువార్త ఎందుకు వినరు? నమ్మరు? కొంతమంది సులభంగా ఎందుకు నమ్ముతారు? దేవుడు దీంట్లో ఎంతవరకు బాధ్యుడు? ఎంతవరకు దేవుని యొక్క జోక్యం సమర్థనీయం? ఒకడు నమ్మడానికి దేవుడు ఒకని మనోనేత్రం వెలిగిస్తే, అలాగు అందరి మనోనేత్రాలు ఎందుకు వెలిగించడు? అనేది ప్రశ్న.

            ఇప్పుడు ఒకడి కళ్ళు తెరువబడ్డాయి. రక్షణపొందాడు అలాగు భూమిమీద మొత్తం మనుష్యులందరి కళ్ళు ఒకేసారి తెరవచ్చుకదా? ఇంకెవ్వరు నరకానికి వెళ్ళే అవసరం ఉండదు కదా? మరి దేవుడు దయగల దేవుడని ఎట్లా అనుకోవాలి? కొంతమందిని కావాలని నరకానికి పంపిస్తున్నాడా? ఇప్పుడు నిత్యజీవమునకు నిర్ణయింపబడినవాడు విశ్వసించాలి అంటాడు. అంటే కొంతమంది నిర్ణయించబడలేదు కదా? అంటే కొంతమంది వీడు పుట్టకముందే నాశనానికి వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు. యాకోబు, ఏశావుల విషయంలో పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే, దేవుడు యాకోబును ప్రేమించాడు. ఏశావును ద్వేషించాడు.  ఇది అన్యాయం గాదా? ఈ మీమాంసను గూర్చి మీరిప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న!

            దేవుడే కొంతమందిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు.  అనేది ఎంతవరకు సమర్ధనీయం అంటారు! ఒక సెంటెన్స్లో మీకు చెబుతాను.  నా వివేచన ఏంటంటే మీరిదివరకే రక్షణ పొంది ఉంటారని నేననుకుంటూన్నాను. గనుక మీకు ఒక సెంటెన్స్ సరిపోతుంది.  అవిధేయతా స్థితిలోనికి మానవజాతి తనంత తానుగా ఏరికోరి ప్రవేశించింది.  ఇది పాయింట్ నెం.1 ఇప్పుడు ఆదాముయొక్క అవిధేయతే కదా? ఇప్పుడు మనందరి అవిధేయతకు కారణం! మనందరము అవిధేయత కుమారులమని లేఖనం పిలిచింది.  Children of disobedience.  ఆదాము యొక్క అవిధేయత ద్వారా, మొత్తం పాపము, మరణము వచ్చేసింది.  అందులో మనము కూడ పుట్టాము. గనుక అవిధేయ స్థితిలో ఉన్నవాళ్ళను దేవుడు ఏం అనుకున్నాడంటే మీరెలాగు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారు! నేనొద్దని చెప్పినా వెళ్ళిపోయారు. నేను విధేయతలో ఉండమన్నాను గాని అవిధేయతలో ఉండమని చెప్పలేదు.

            మీరు అవిధేయతలోకి వెళ్ళారు గనుక నేను మీ పట్ల కృప చూపాలి.  ఇక్కడ చెప్పేదేంటంటే, అన్యులుగాని, యూదులుగాని ఇక్కడ అన్యజనాంగము, ఇశ్రాయేలు జనాంగము ఈ ఇద్దరిని గూర్చి మాట్లాడుతున్నాడన్నమాట! రోమా 11:32వ వచనం గనుక అందరికి కృప చూపాలని దేవుడనుకున్నాడు. వీళ్ళకందరికి సువార్త అందించాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ సువార్త వాళ్ళకు అందేవరకు మీ మనోనేత్రాలు నేను తెరువను.  సువార్త మీకు అందిచబడినప్పుడు, మీ మనోనేత్రాలు వెలిగించబడితే రక్షకుని దగ్గరకు రాగలుగుతారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి.  వీళ్ళను అవిధేయులుగా దేవుడు చేయలేదు. ఆదాము ద్వారా అవిధేయులైనారు పాయింట్ నెం 1.

            రెండవ విషయం ఆదాము ద్వారా అవిధేయులైన వాళ్ళకు కృప చూపాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. వీళ్ళందరిని నాశనం అయిపొమ్మని కాదు నిర్ణయించింది! వీళ్ళకు కృప చూపాలి.  కృప చూపాలంటే మీరు కొంతకాలం అందులో ఉండండి. కృపకు ఆధారమైన సువార్తను మీ ముందుకు తీసుకువస్తాను. ఇప్పుడు సువార్త అనేది ఉండాలి! సువార్త అనేది ఉండాలంటే ముందు యజ్ఞం జరగాలి! యజ్ఞం జరుగకపోతే సువార్త ఉండదు కదా? గనుక సువార్త అనేది వచ్చేదాక అన్యజనాంగాలు గాని, యూదేతర జనాంగాలు గాని అవిధేయతలో మీరు కొంతకాలం ఉండటం మంచిదే! ఎందుకంటే అలాగుంటే కృపా సువార్త నేను మీకు చెప్పగలుగుతాను. అనేది దేవుని యొక్క బుద్ధిజ్ఞానముల గాంభీర్యం!

            దాని గురించే పౌలు, ఆహా దేవుని బుద్దిజ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం అంటాడు. దేవుడు వీళ్ళని అవిధేయులుగా చేయలేదు, అది ఆదాము చేసిన తప్పు.  ఇది దేవుడు చూపిస్తున్నా పరిష్కారం.