(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు దాని గురించి మీరు అడిగారు గనుక ఒక మంచి విషయం చెబుతాను. నేను నా సేవ ప్రారంభంలో నల్గొండ జిల్లా నకిరెకల్లో నేను మొదటి సంఘం స్థాపించాను. ఆ రోజుల్లో చాలా బిజీ ప్రీచర్ అయిపోయాను. నాకు ఏకాంత ప్రార్ధన కొరకు సమయం లేకుండా, స్థలం అనేది దొరకకుండా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పట్లో మాకు వరుసకు చిన్నాయన అయేటట్వంటి మిట్టగడపల వేధ నాయకంగారు. ఈయన అప్పుడు (WMA) లో ఏరియా సూపర్వైసర్గా పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు నేషనల్ సూపవ్వైజర్ గోడి శ్యామేల్గా గారు, శ్రీకాకుళం. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు.
యం.యన్. వేధనాయకం గారు, అక్కడ గోపాలపురం సూర్యపేట్లో హాస్టల్ గెస్టురూమ్స్ అన్ని కట్టి ఏంనాయనా, నువ్వెపుడైనా వచ్చి ప్రార్ధన చేసుకోవాలంటే, నువ్వు వాడుకోవచ్చుని చెప్పారు. అక్కడ నేను మూడు దినాలు ఉపవాసం ఉన్నా! అది (1982-1983) ఆ కాలం! ఎందుకంటే 1984లో నేను హైదరాబాద్ వచ్చేసా! మూడు దినాలు ఉపవాసం ఉండి దేని కొరకు ప్రార్ధన చేసానంటే దినకరన్గారిలాగా నాకు స్వస్థపరిచే వరం కావాలి. Healing ministry నాకు కావాలని నేను ప్రార్ధన చేసా. మూడు దినాలు ప్రార్ధన చేసినాక దేవుని చల్లని మెల్లని స్వరం నాకు వినబడింది. నా కుమారుడా, ఈ ప్రార్ధన నీవు చేయవద్దు. ఇది నా చిత్తము కాదు. అది నీకే క్షేమము కాదు. నేను నీకు ఆ రకమైన పరిచర్య ఇస్తే నువ్వు చెడిపోతావు. నీ ద్వారా అనేకమంది చెడిపోతారని ప్రభువు చెప్పాడు. నేనప్పుడు ప్రభువును, అదేంటి ప్రభువా, పరిశుద్ధాత్మ వరాలిస్తే, నేను చెడిపోవడం ఏంటి? పరిశుద్ధాత్మ వరాలు క్షేమాభివృద్దికరాలు కదా? ఆత్మ ఒక్కడే ఈ వర్గములన్ని తన చిత్తము చొప్పున పంచి ఇచ్చుచూ క్షేమాభివృద్ధి కలిగించుచున్నాడని ఉన్నది. 1 కొరింథి 12లో పరిశుద్దాత్మ కృపావరాలు నేనడిగితే, అవ్విస్తే నేను చెడిపోవడం ఏంటి? అని అడిగాను అప్పుడు యేసయ్య నీకు ఉన్నట్వంటి అభిమానులు, ఫాలోయింగ్, తీవ్రమైన అభిమానం ఒక్కసారి గుర్తు చేసుకో! అప్పట్లో నాకింకా పాతికేళ్ళు కూడా లేవు. అప్పుడు 23-24 ఏండ్ల ప్రాయంలో వెళ్ళకిలా పడుకునేవాడ్ని. చాపమీదుగా, చెక్కమీదుగా దిండు, బెడ్ ఏమి లేకుండా ఎందుకంటే సైకిల్, స్కూటర్ ప్రయాణాలు ఎక్కువ వెన్నుపూసకి రిలాక్సేగా ఉండాలని.
ఎలుకలు గోకినట్లుగా కాళ్ళదగ్గర ఏదో గోకినట్టు అనిపిస్తే ఉలిక్కిపడి లేసేవాడ్ని. కొంతమంది పురుషులు, స్త్రీలు, ఎక్కువసమయాల్లో స్త్రీలు పురుషులు కూడా నా రెండు కాళ్ళు ఇలా మొక్కి, దండం పెట్టుకుని వెళ్తుండేవారు చాలా సార్లు ఆపి చెప్పాను. తప్పు ఇది. నా కాళ్ళు మ్రొక్కకూడదు. పేతురు అంగీకరించలేదు. ప్రకటన గ్రంథంలో ఒక దేవదూతే అంగీకరించలేదు. నా కాళ్ళు మొక్కకూడదు అమ్మాయి, మంచిదికాదు అని చెప్పాను. నేను గురువునయితే, నేనే మిమ్మల్ని కూర్చోబెట్టి కాళ్ళు కడగాలి, అదీ నా స్థాయి! అంతేగాని దైవాజ్ఞ ప్రకారం, నేను కాళ్ళు కడగాల్సిందిపోయి, మీరు కాళ్ళు మొక్కుతున్నారు తప్పిది, మంచిదికాదు. అని ఎన్నిసార్లు హెచ్చరించినా కొన్ని వేల సార్లు చెప్పి ఉంటాను. అయినా సరే, ఒక పిచ్చి అభిమానము, ఒక పూజ్యభావము వాళ్ళలో ఎలా వచ్చేసిందో? ఎంత చేసినా తీసేయలేకపోయాం. ఎక్కడికి పోయినా నా హ్యండ్ కర్చిఫ్స్ మిస్స్ అయిపోయేవి వాళ్ళని పరిశుద్ధ దొంగలని నేను పేరు పెట్టాను. అయ్యగారు వాడినట్వంటి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని మా ఇంట్లో పెట్టుకుంటే మాకు అద్భుతాలు జరిగినాయి. మాకు రోగం నయమయ్యింది. మా ఇంట్లోకి ధనం వచ్చింది. చీకట్లు పారిపోయినయి అని నేనెప్పుడు చెప్పుకోలేదు. ఒక్కసారి కూడ చెప్పుకోలేదు. వాళ్ళు ఎవరో, అనుకోకుండా ఏదో జరిగింది, వాళ్ళు డిస్కవర్ చేసారు. అయ్యగారు హ్యాండ్ కర్చీఫ్ మా ఇంట్లో మరచిపోయారు. అప్పటినుండి మేలు జరిగిందని అలాగలాగ వ్యాప్తి చెందింది.
అప్పుడు వేధనాయకం గారి హాస్టల్లో దేవుడు నాతో నీవు స్వస్థపరుస్తానని చెప్పుకోలేదు, స్వస్థపరచే వరం ఉందని నీవు చెప్పుకోలేదు. ఇంత మంది నీ కాళ్ళు మొక్కి నిన్ను దేవుడిలాగా చేస్తున్నారు అటువంటిది నీకదే కృపావరం గనుక నీకిచ్చుంటే ఈ అభిమానము, ఆ వరములు ఇది కలసి నిన్నొక విగ్రహం చేస్తారు. నిన్నే దేవుడని పూజిస్తారు. ఏదైనా ఒక దశలో నువ్వు కూడ చెడిపోయే అవకాశం ఉన్నది. వాళ్ళందరు నన్ను ఆరాధించటానికి నువ్వొక సాధనైతే నీకు దీవెన, వాళ్ళందరికీ ఆశీర్వాదం. అంతేగాని వారు నన్ను వదిలేసి నిన్నారాధిస్తే? అందరూ భ్రష్టు పట్టి పోతారు కదా? అని దేవుడన్నాడు. అప్పుడు నేను యేసయ్యా, నీ మాట నేను వింటున్నాను. నాకీ వరాలొద్దు, ఏమీ వద్దు నేను చెడిపోవద్దు, నన్ను అభిమానించేవాళ్ళు కూడ చెడిపోవద్దు. మా అందరి హృదయాల్లో యేసుక్రీస్తే ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. నాకు ప్రమాదకరం, అందరికీ ప్రమాదకరం అయినట్వంటి అద్భుతాలు సూచక క్రియలు నాకు అక్కరలేదు తండ్రి అని ఆయన చిత్తానికి విధేయుడనై అప్పగించుకున్నాను.
అప్పుడు కంచుకంఠం ఒకటి వినబడింది. నా కుమారుడా, నా చిత్తానికి నీవు ఇంత సులభముగా, ఇంత హృదయపూర్వకంగా లోబడుతున్నావు కాబట్టి నేను సంతోషపడుతున్నాను. నీ ద్వారా నా కవసరం అనుకున్నప్పుడు, ఏ కృపావరమైన, మొత్తం 9 కృపావరాలు నేను పని చేయిస్తాను! నా నామానికి మహిమకరం, అయినప్పుడు నా చిత్తం అయినప్పుడు, స్వస్థత పనిచేస్తుంది. అద్భుతకార్యాలు జరుగుతాయి. ప్రవచనాలు వస్తాయి. అన్యభాషలు వస్తాయి. భాషలకు అర్థం చెప్పడం వస్తుంది. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం అను వరం. అన్ని వరాలు నీ ద్వారా నేను పని చేయిస్తాను. ఏ వరము ఎప్పుడు, ఎక్కడ, పనిచెయ్యాలో నేను డిసైడ్ చేస్తా! నా కప్పగించుకున్నావు. నాకు విధేయుడవు అయినావు. గనుక నీ ద్వారా అన్ని కార్యాలు చేస్తానని ప్రభువు చెప్పాడు.
నీ చిత్తమయితే ఎప్పుడైనా, ఏదైనా చేసుకో నాయనా, నా బ్రతుకు మాత్రం సువార్త ప్రకటనకే అంకితం అని దేవునికి ప్రతిష్టించుకున్నా. అందుకొరకు నేనెప్పుడు చెప్పుకోకపోయినా కొన్ని వేల మంది జీవితాల్లో, మా సంఘాల్లో, మా పరిచర్యలో అద్భుతాలు జరిగినయి. అందుకే నేను దానికి ప్రాధాన్యత ఇవ్వను. రేపు పొద్దున అబద్ధ ప్రవక్తలు కూడ అద్భుతాలు చేస్తాడు. మోషే కర్ర క్రింద పడవేస్తే పామయింది. ఐగుప్తు మాంత్రికులు కూడా అదే అద్భుతం చేసారు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగివచ్చింది. ప్రకటన 13లో అబద్ద ప్రవక్త కూడ మహా శ్రమల కాలంలో అగ్నిని దింపుతాడు. గనుక అద్భుతాలన్నది గొప్ప విషయం కాదు. దేవుడూ చేసాడు! సైతాను కూడా కొన్ని అద్భుతాలు చేస్తాడు. కాని చచ్చిపోయిన వాని లేపడం కంటే గొప్ప అద్భుతం, పాపముల్లో, అపరాధముల్లో చచ్చిపోయినవాళ్ళను, రక్షణ లేనివాళ్ళకు రక్షణ వెలుగులోకి నడిపించి, క్రొత్త జీవితం వాళ్ళకు ఇవ్వడం అనేది లాజరును లేపినదానికంటే గొప్ప అద్భుతం. కనుక దాని మీద దృష్టి పెట్టాను మిగతావి దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నయి. నేనైతే అసలు పట్టించుకోనే, పట్టించుకోలేదు. దగ్గరకొస్తే చెయ్యి పట్టి ప్రార్ధన చేసి వెళ్ళిపోతాను. దేవుని చిత్తమయితే వాళ్ళు బాగుపడతారు, కాకపోతే బాగుపడరు. అది దేవుని చిత్తం కాని, ఈ స్వస్థతలు జరిగినందుకు యేసు దేవుడు కాదు. జరగకపోతే ఆయన దేవుడు కాకుండా పోడు. లేఖనములు ఆయనలో నెరవేర్చబడ్డవి గనుక ఆయన దేవుడు అనేది నా సువార్త!