21. ప్రశ్న: ప్రార్థన ఎందుకు చేయాలి? ఏ విధంగా చేయాలి? ప్రార్థిస్తే ఆత్మీయ ప్రపంచంలో ఏమి జరుగుతుంది?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు

జవాబు: ఏదైనా Natural గా ఉండాలి గానీ చెయ్యాలి అనుకొని చేస్తే అది భారమే. ప్రార్ధన ఎందుకు చెయ్యాలి అంటే? యౌవనస్థులు కొంత మంది ప్రేమలో పడుతారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. వారు ఒక్కచోట ఉన్నంత సేపు మాట్లాడుతూనే ఉంటారు. తర్వాత పార్క్, కాఫీ అంటారు. అంతా అయిన తరువాత ఎవరింటికి వాళ్లు వెళ్లినాక fresh అయి మళ్లీ కాల్ చేసి మాట్లాడతారు. అంత సేపు మాట్లాడారు కానీ ఇంటికి వెళ్లాక మళ్లీ మాట్లాడాలి అనిపించింది. ఒక మనిషి మీద ప్రేమ విపరీతంగా ఉన్నప్పుడు ఊరికే మాట్లాడాలని ఆశ పుడుతుంది. దేవుని మీద అలాంటి ఆశ పుట్టినప్పుడు చేసేది అసలైన ప్రార్ధన. అందుకే అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, “నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతో ప్రేమించాలి”. దేవుని మీద ఒక emotion ఉండాలి. ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు వారిని చూడాలనే ఆశ, వాళ్లతో మాట్లాడాలనే ఆశ, వాళ్ల మాటలు వినాలనే ఆశ కలుగుతుంది. దేవుని మీద ఉన్న విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు మోకరించాలి, ఆయనను ఆత్మ నేత్రాలతో చూడాలి, నా మనస్సులో భారం ఆయనకు చెప్పుకోవాలి అని ఆశ ఉంటుంది. ఆయన ఏదైనా చెప్తే వినాలి అని ఆయన మీద ప్రేమతో, తహతహతో మోకరించినప్పుడు ప్రార్ధన అనేది సహజంగా పుడుతుంది.