169. ప్రశ్న : శాస్త్రులతో, పరిసయ్యులతో యేసు ప్రభువు అధికారము గల వాని వలె మాట్లాడినాడు.  మత్తయి సువార్త 28:18వచనంలో ఆయనకు సర్వాధికారము ఇయ్యబడింది.  చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటాడు.  అంటే అంతకు ముందు ఉన్న అధికారానికి మళ్ళీ కొత్తగా వచ్చిన అధికారానికి తేడా ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    యేసు ప్రభువు వారు ఆయన సిలువ యజ్ఞం జరిగించిన తర్వాత తనను తాను ఆయన నిరూపించుకున్నాడు. ఈ విషయం మనకు రోమా 1:7 వచనంలో యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్తానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింప బడెను.  అంటే ఆయన దేవుని కుమారుడని ఋజువైనదెప్పుడు అంటే ఈస్టర్ సండే.  ఆయన చనిపోయి లేవడం ద్వారా ఈయన దేవుని కుమారుడని ప్రూఫ్ దొరికింది.  ఎందుకంటే ఆయనలో రవ్వంతయిన పాపము ఉంటే మరణము అనే దానిని జయించేవారు కాదు.  మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అంటాడు.  అపోస్తలుల కార్యములు 2:24 వచనంలో మరణము ఆయనను బంధించి ఉంచుట ఎందుకసాధ్యము అంటే, ఆయనలో పాపము లేదు గనుక.  పాపము అనేది ఉంటే మరణానికి పట్టు దొరుకుతుంది.  గనుక యేసుప్రభువు మరణించి మళ్ళీ లేచినప్పుడు ఆయన యొక్క దైవకుమారత్వము నిరూపణ అయ్యింది.  విశ్వం యొక్క దృష్టిలో మరి అంతకు ముందు కూడ ఆయన అధికారము గల కార్యాలు చేసాడు కదా అంటే, ఆయన చేసినటువంటి అంతస్తు ఆ లెవల్ వేరు ఎందుకంటే ఆయన అన్నాడు.  యోహాను 14:10వచనంలో తండ్రి నాయందు నివసించుచూ తన క్రియలు చేయుచున్నాడు.  12వచనంలో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును.  యోహాను 7:16వచనంలో నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే.  యేసుక్రీస్తు ప్రభువు దేవునిగా తన అధికారమును ఉపయోగించుకోలేదు. తండ్రి అయిన దేవుని ఆజ్ఞ అధికారము, సహకారము, ఆయనిచ్చిన అభిషేకము తోనే అన్ని కార్యాలు చేసాడు.  కాబట్టి నేను పరిశుద్ధ మానవునిగా తండ్రి యందు విశ్వాసముంచి ఇవన్నీ చేయగలిగాను. నా యందు విశ్వాసముంచితే మీరు కూడ ఇవే కాదు ఇంకా ఎక్కువ కూడా చేస్తారు అన్నాడు.  అంటే ఆయన దేవుని యందలి విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన అనుమతి, ఆజ్ఞ ఆయన ఇచ్చిన శక్తితో చేసాడు. ఇప్పుడు చనిపోయి లేచిన తర్వాత ఈ పరిశుద్ధ జీవితము లోపరహితమైన వ్యక్తిత్వము నిరూపించబడింది.  కాబట్టి ఇప్పుడు తనంతట తాను ఏమైనా చేయగలడు.  ఇప్పుడు నన్ను పంపిన వాని వలన అని అనడు. ఆయన పునరుత్థానము తర్వాత ఆయన పాత స్టేటస్ మళ్ళీ వచ్చింది.  యోహాను 17:5వచనంలో ఆయన లోకము పుట్టక మునుపు ఉన్న మహిమలో నన్ను చేర్చుము అన్నాడు.  అంటే యేసుప్రభువు 2000ఎండ్ల క్రిందటి వాడు కాదు. లోకము పుట్టక మునుపే ఉన్నాడు.  శరీరధారిగాకాదు, ఒక మహిమలో ఉన్నాడు.  మరి ఆ మహిమను వదిలి రిక్తునిగా ఈ భూమి మీదికి వచ్చాడు.  యేసు చనిపోయి, తిరిగి లేచిన తరువాత మళ్ళీ మునుపున్న మహిమను ఆయన తీసుకున్నాడు.  గనుక దైవ సమానుడుగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి పైన ఆధారపడి కార్యాలు చేయటం వేరు.  పునరుత్థానం తర్వాత తన సొంత మహిమతో కార్యాలు చేయటం వేరు.