26. ప్రశ్న : లూకా 22:36లో అందుకాయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు, జాలెయు తీసికొని పోవలెను; కత్తిలేనివాడు తన “బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను”. కత్తి కొనుక్కొమన్నారు అది అర్థం కాలేదు అయ్యగారు?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: యేసుప్రభు వారు ఒకచోటనేమో కత్తిపట్టుకొను వారందరు కత్తిచేతనే నశించెదరు. పేతురు – నీ కత్తి నీ ఓరలో పెట్టుమన్నాడు. ఆ తరువాత ఇక నుండి కత్తిలేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కొవాలన్నాడు. అంటే ఈ రెండిటికి సమన్వయం చెబుతూ చాలాసార్లు, చాలా సంవత్సరాల క్రితమే చెప్పాను. విషయం ఏమిటంటే క్రైస్తవుని దగ్గర ఒకనికి హాని చేయగలిగిన శక్తి ఉండాలి కాని దాన్ని ఉపయోగించకూడదు. అతడే సంపూర్ణ క్రైస్తవుడు. ఇప్పుడు శత్రువును క్షమించమన్నాడు. క్షమించమంటే అర్థం ఏంటి? వానికి తిరిగి ప్రతికీడు చేసి, మళ్ళీ దాడి చేసి, వాన్ని గాయపరిచే శక్తి ఉన్నోడు క్షమాపణ యిస్తే అది క్షమాపణ అవుతుంది. గాని వాని ఏం చేయలేనోడు చాతగాక క్షమించాను పోరా అంటే వాళ్ళు నవ్వి పోతారు గదా! ఎవడైనా మనకు హాని చేసినప్పుడు పగతీర్చుకునే బలము, శక్తి, ధైర్యము సత్తా మనకు ఉండాలి. మనకు వానికి మళ్ళా శిక్షించ గలిగే శక్తి ఉంటే కూడా దాన్ని ఉపయోగించకుండా దేవుని ఆజ్ఞకు విధేయులమై, నా దగ్గర కత్తి ఉన్నదిరా కాని నీ మీద ఉపయోగించను, ఉపయోగించోద్దు అన్నాడు నా ప్రభువు అనాలి. గనుక కత్తి ఏలాగు వాడము కదా మనకెందుకూ అనేది కాదు. కత్తి అంటే కత్తి అనే కాదు, ఆయుధమనే కాదు. కత్తి అంటే ఏమిటంటే మనల్ని మనం కాపాడు కోవడానికి ఒక ఆయుధము, సామర్థ్యము, ఎదుటివాన్ని కూడా తలచుకుంటే ఏమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు. ఇవి క్రైస్తవునికి ఉండాలి. క్రైస్తవులు బలవంతులుగా ఉండాలి. అంటే అర్థమేంటంటే శరీర ఆరోగ్య విషయంలో బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, సామాజికంగా బలంగా ఉండాలి. అన్ని బలమైన స్థానాల్లో క్రైస్తవులు ఉండాలి. మనం తలుచుకుంటే అవతలవాన్ని, ఏమైనా చేయగలం కాని యేసయ్య నామాన్ని బట్టి క్షమిస్తున్నా అన్నప్పుడు వాళ్ళు మనలో క్రీస్తును చూడగలుగుతారు.