53. ప్రశ్న : కొలస్సి 2:16,17 ప్రకారం “కాబట్టి అన్నపానముల విషయములైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమివ్వకండి! ఇవి రాబోవు వాటి ఛాయయే గాని క్రీస్తులో నిజస్వరూపము ఎలా అవుతుంది? తెలపగలరు.అలాగే కీర్తన 44:19 అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు, గాడాంధకారము చేత మమ్మును కప్పియున్నావు అనే లేఖనము యొక్క అర్థం వివరించగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఒకటి, రెండు ప్రశ్నలున్నాయి. కొలస్సి 2:16,17 లలో 16వ వచనంలో యేసులో ఉన్నటువంటి 4 ఆశీర్వాదాలు 4 విధాల ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు, ధన్యతలు, ఆధ్యాత్మిక మర్మమైన సంగతులు చెప్పాడు. అవి ఏంటంటే అన్నపానములు, పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినము ఇవి యేసు ప్రభువు వారిలో రాబోవుచున్న దైవాశీర్వాదాలకు ఒక నమూనా, ఒక ఛాయ. అసలైన సంగతులు యేసులో ఉన్నవి. ధర్మశాస్త్రములో ఉన్న ఈ నాలుగు సంగతులు, యేసులో ఉన్న నాలుగు ఆశీర్వాదాలకు నీడలు, ఛాయయై ఉన్నవి అని పౌలు చెప్పాడు. ఆ సోదరుడు అంటున్నది ఏంటంటే అన్నపానములు ఒక ఛాయ, నిజమైన అన్నపానములు యేసులో ఉన్నవి. పండుగలు ఒక నీడ, నిజమైన పండుగలు యేసులో ఉన్నవి. విశ్రాంతిదినము ఒక ఛాయ, నిజమైన విశ్రాంతి యేసులో ఉన్నది. కానీ అమావాస్య ఒక నీడ అసలైన అమావాస్య క్రీస్తులో ఉందని అంటే ఎలా సబబు? ఎందుకంటే అమావాస్య అంటే భయం కలిగించేది. చిమ్మచీకటి గనుక ఇష్టం ఉండదు. కవులు ఎప్పుడైనా వెన్నెల గురించి కవిత్వాలు రాశారు. పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది అని. వెన్నెల కాంతిలో అడవి సౌందర్యాన్ని వెన్నెల కాంతిలో వివరించారు. గానీ అమావాస్య గురించి ఎవరు కవిత్వాలు రాయలేదు. అమవాస్యను ఎవరు ఇష్టపడరు. అలాంటిది నిజమైన అమావాస్య యేసు ప్రభువులో ఉండడమేమిటి అనేది ఆయన సందేహం. అక్కడ ఒక అందమైన సత్యం (బ్యూటిఫుల్ ట్రూత్) ఏంటంటే అమావాస్యను ఇంగ్లీష్ లో న్యూమూన్ అని అంటారు. చంద్రునికి 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయం ఉంటుంది. రాను, రాను వెన్నెల వెలుగు ఎక్కువయ్యేది వృద్ది, దీన్ని శుక్లపక్షం అంటారు. రాను రాను చీకటి ఎక్కువయ్యేది క్షయం. దీన్ని కృష్ణపక్షం అంటారు. కృష్ణ పక్షంలో చంద్రుడు తన వెలుతురును ఇవ్వక క్షీణించి, పూర్తిగా ఆకాశంలో లేడేమో అన్నట్లుగా కనిపించడు. ఆ రోజును అమావాస్య అంటారు. ఆ రోజు నుండి చంద్రుడు వృద్ధి కావడం మొదలు బెడతాడు. క్రీస్తులో అమావాస్య అంటే నూతన మాసారంభం అని అర్థం. కొత్త నెల యొక్క మొదలు అని అర్థం అంతేకాదు ఆత్మీయంగా తీసుకుంటే విశ్వాసికి గానీ, స్థానిక సంఘానికి గానీ అమావాస్య అనేది నూతన ఉజ్జీవానికి ప్రారంభం. చంద్రుడు క్షీణించి, క్షీణించి అసలే లేకుండా పోయినట్లు ఒక విశ్వాసి కూడా అప్పుడప్పుడు తగ్గిపోతా ఉంటాడు. ఏకరీతిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఏ విశ్వాసి కూడా ఉండడు. అందరూ కొన్నిసార్లు పెరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు తరుగుతూ ఉంటారు. అంటే కొంతకాలం దేవునికొరకు అద్భుతంగా ప్రార్ధనలో ఉండాలి. దేవుని కొరకు గొప్పకార్యాలు చేయాలని, చక్కగా ముందుకు సాగుతూ ఉంటారు. కొంతకాలమైనాక ఏదో ఒకటి జరిగి నిరాశా నిస్ప్రుహలు, ఏం దేవుడు, ఏం భక్తి అంటూ అమావాస్య లాంటి స్థితిలోకి వెళ్లిపోతారు. ఎప్పుడైతే వెలుగేలేని మనిషిగా, అసలు ఏ మాత్రం వెలుగు లేనటువంటి చీకటిగా అంటే నిరాశా, నిస్ప్రుహ అనే చీకటి. లేక దేవుని వాక్యం లేకపోవడమనే చీకటి, దేవుని ముఖకాంతిలో ఉండకుండా ఉండే అనుభవం అనే చీకటి, సువార్త చెప్పలేని చీకటి, ఏరకంగానైనా మొత్తం చీకటైపోయినప్పుడు అది అతని జీవితానికి ముగింపుకాదు. దేవుడు విడిచిపెట్టడు. మొత్తం వెలుగులేకుండా క్షీణించిపోయిన చంద్రుడు మళ్ళీ ఏ విధంగా వృద్ధిలోకి ఎలా వస్తాడో, ప్రతివిశ్వాసి తన జీవితంలో మళ్ళీ నూతన ఉజ్జీవాన్ని పొందుతాడు. విశ్వాసి జీవితంలో అమావాస్య సంభవించినప్పుడల్లా, విశ్వాసి జీవితంలో అమావాస్య వచ్చి, విశ్వాసిని చీకట్లో ముంచేసినప్పుడల్లా దేవుడు ఆ విశ్వాసిని దర్శించడం మొదలు బెట్టే దినమది. అప్పుడే విశ్వాసి మళ్ళీ పెరగడం ప్రారంభిస్తాడు. గనుక యేసులో క్షీణించి, కృషించి పోయిన ప్రతివిశ్వాసికి నూతన ఉజ్జీవ ఆరంభం అవుతుంది. ఇది “అమావాస్య యేసులో నిజస్వరూపం అన్నమాట”.


2వ జవాబు: కీర్తన 44:19 వచనం ప్రకారం “అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు”అనే వచనానికి అర్థం ఏంటంటే, మనుష్యులు ఎవరైనా ఆవులును, గేదెలను, కుక్కలను, పిల్లులను, గొర్రెలను, మేకలను పెంచుకుంటారు గానీ ఎవరూ నక్కలను పెంచుకోరు. నక్కలు పెంచుకునే జంతువులు కావు. వీటిని ఎవరు మచ్చిక చేసుకోరు. సాధుజంతువులు కావు. ఒంటెలు, గుర్రాలు, గాడిదలు అన్ని పెంచుకుంటారు. గానీ నక్కలు, తోడేళ్లు అడవిజంతువులు వీటిని ఎవరు పెంచుకోరు. కుక్క, నక్క ఆకారానికి కొంచెం దగ్గరి పోలికలున్నా గానీ కుక్క స్వభావం, నక్క స్వభావం చాలా వేరు. కుక్క విశ్వాసానికి ప్రతీక, నక్క జిత్తులమారి. కుక్క చాలా విశ్వాసం గల జంతువు తన యజమాని కొరకు తన ప్రాణమైనా ఇచ్చేస్తుంది. కానీ నక్క అడవి జంతువు నక్కలు అరణ్యంలో ఉంటాయి. కాబట్టి…. “నక్కలున్న చోట” అంటే అరణ్యస్థలాలలో అని అర్థం. అడవి లాంటి ప్రదేశాలలో నీవు మమ్మల్ని నలుపుతున్నావు అని అర్థం. రెండవ విషయం మోసగాండ్ర మధ్యమమ్మును నలుపుతున్నావు అని అర్థం. నక్కలు అడవిలో ఉన్నాయి. ఊళ్లో ఉండవు అని చెప్పుకున్నాం. కానీ ఊళ్లో ఉన్నవి మానవ నక్కలు. అందర్ని నమ్మలేము అందరు అన్న, తమ్ముడు, వరుసలు పెట్టి పిలుస్తాడు. కానీ వెనుక ఏ గోయ్యి తవ్వుతాడో తెలియదు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుతోనే ఉండి ఆయనకే గొయ్యి తవ్వాడు. అది దేవుని చిత్తం గనుక దేవుడు దానిని allow చేశాడు. గానీ వీని Nature అయితే మంచిది కాదు కదా! అలాగే నక్కలున్న చోట అంటే మానవ సమాజంలో నక్కలున్నాయి. భౌతికంగా అడవి లాంటి ప్రదేశంలో నక్కలున్నాయి. కానీ బాగా మోసం చేసే స్వభావం గల నక్కలు లాంటి మనుషుల మధ్యలో మమ్మును నిలిపియున్నావు అని అర్థం.