234. ప్రశ్న: మెలుకువగా ఉండి ప్రార్ధన చేయడం అంటే ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      పరమగీతము 5:2 “నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది” ఇదీ మనకు ఉండవల్సిన అనుభవము.  పరిస్థితి భౌతికంగా, శారీరకంగా మనం నిద్రపోయినా, మెళకువగా ఉన్నా మన మనస్సు మాత్రం దేవుని స్వరం వినడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి.  అది ఆత్మ సంబంధమైన మెళకువ. ఆత్మ సంబంధమైన మెళకువ, సన్నద్ధత లేనివాడు 24 గంటలు మెళకువగా ఉంటే ప్రయోజనం ఏమిటి? దేవునితో సహవాసం చేయడు, దేవుడు మాట్లాడుతుంటే వీడికి వినబడదు. దేవునితో వీడు మాట్లాడడు.  24 గంటలు నిద్రపోకుండా కూర్చుంటాడు.  ప్రయోజనం ఏమిటి? అంటే ఏమీ లేదు. మనం భౌతికంగా నిద్రలో ఉన్నా లేక మెళుకువతో ఉన్నా నీ అంతరంగ పురుషుడు దేవునిని సంధిస్తూనే ఉండాలి. ఆ మెళుకువ ఎప్పుడు వస్తుంది అంటే దేవుడిని మీరు హృదయ పూర్వకంగా ప్రేమించాలి, దేవుడికి అసహ్యమైనది మనలో ఏదీ లేకుండా జాగ్రత్తపడాలి. అంతగా దేవున్ని ప్రేమించేవారిని ఆయన తప్పక గుర్తిస్తాడు. ఆయన మీద అంత ప్రేమ మన హృదయంలో నిండి ఉన్నప్పుడు “ఒకడు దేవున్ని ప్రేమించిన యెడల దేవునికి ఎరుకైనవాడే” అంటాడు పౌలు గనుక ఆయనే వచ్చేస్తాడు. అప్పుడు అనుసంధానం అయిపోతుంది. మనం పడుకొనే ఉంటాం లోపల ఒక స్వరం దేవునితో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ స్థితి ప్రతి క్రైస్తవుడికీ రావాలి.