62. ప్రశ్న : లూకా సువార్త 6:40వ వచనంలో “…. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును” అనే లేఖన భాగంలో సిధ్ధుడు అంటే అర్ధం ఏమిటి? బోధకుడు అంటే యేసుక్రీస్తు లాగా ఉంటాడు అని అర్ధమా? వివరించండి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: సిద్ధుడు అంటే సిద్దిపొందినవాడు అని అర్ధం. మన బైబిల్ బ్రాహ్మణ పండితులు చేసిన తర్జుమానే మనకు వచ్చింది. విలియం కేరి గారు డెన్మార్క్ మహారాజు యొక్క పర్మిషన్తో 200 సం॥రాల క్రితం డెన్మార్క్ వారి భూభాగంలో వెస్ట్ బెంగాల్లో పర్మిషన్ తీసుకొని షూ మేకర్ (కాబ్లర్)గా కష్టపడి పని చేసుకుంటూ అనేక భారతీయ భాషలలో బైబిల్ను తర్జుమా చేసారు. అలాగే తెలుగులోకి కూడా తర్జుమ చేశారు. కానీ విలియమ్ కేరి గారు తర్జుమా చేసిన బైబిల్ కాదు మనకొచ్చిన బైబిల్, ఆ తరువాత బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వచ్చింది. కొన్ని వందల మంది బ్రాహ్మణ పండితులను, సంస్కృతం, ఇంగ్లీష్ బాగా నేర్చుకున్న పండితులను వారికి సువార్త కూడా ప్రకటించి, (వారు కూడా ప్రభువును అంగీకరించి, రక్షణ పొందారు) వారితో వ్రాయించారు. వారు కూడా ఉపవాసం ఉండి డైరెక్ట్ గా హెబ్రీ, గ్రీక్ భాషల మూల భాష నుండి తెలుగులోకి తర్జుమా చేశారు. అందుకే బ్రాహ్మణుల యొక్క స్వచ్ఛమైన, సరళమైన, ఉత్తమమైన, శ్రేష్ఠమైనటువంటి భాష మన తెలుగు బైబిల్ లో దొరుకుతుంది. అందులో భాగమే సిధ్ధుడు అనే మాట. అలాగే చాలా పదాలు ఉపయోగించారు. తెలుగు భాష చాలా సుందరమైన భాష బైబిల్ లో చదివితే భాష మీద పట్టు అనేది కూడా వస్తుంది. సిద్ధుడు అంటే సిద్ధిపొందినవాడు. సిద్ధిపొందిన వారు అంటే నీ కోరిక యావత్తు సిద్ధింపజేయును గాక, సంపూర్ణ సిద్ధి అనే మాట బైబిల్లో లో ఉంది. అంటే ఏ ఆకృతి, ఏ నైజం, ఏ స్వభావం, నీ అంతరంగ పురుషుని యొక్క పోలికలు, నీ ప్రవర్తన, నీ భావజాలం ఎలా ఉండాలి అనే ఒక గోల్ ఏదైతే ఉన్నదో, నీవు ఏ రూపంలోకి మార్చబడాలి అని దేవుడు అనుకున్నాడో, ఆ రూపంలోకి నీవు 100%గా చెక్కబడడం. దేవుడు నిన్ను చెక్కి, చెక్కి, చెక్కి నేననుకున్న రూపానికి ఈ శిల్పం వచ్చిందని, ఇంకా ఒక్క దెబ్బకొట్టినా శిల్పం యొక్క ఆకారం, రూపం, చెడిపోతుంది అనే భావన దేవునికి వచ్చినప్పుడు, భక్తుడు కోరుకునేది కూడా ఏమీ ఉండదు. అప్పుడు ఈ భక్తుడు కూడా దేవుడితో కలిసి లీనమై, మమేకమై, భార్యభర్తలు ఏక శరీరమైనట్టు, ఈ భక్తుడు ప్రభువుతో కలిసికొని ఏకాత్మయైన స్థాయి ఈ భక్తుడు పొందుతాడు. ఆ తరువాత అది కావాలి, ఇది కావాలి అనే కోరికలను దేవుని దగ్గర పెట్టి తపస్సు చేసేదేముండదు. దేవున్ని, అడగడానికి, కోరడానికి ఏమి ఉండదు ఇక. దేవునితో ఏకాత్మయైనప్పుడు దేవుని కోరికలే ఇతనిలో నేరవేరినప్పుడు ఇతనికి ఇక సొంత కోరికలేముండవు. అప్పుడు అతడు అచ్చం ప్రభువులాగా ఉంటాడు.