96. ప్రశ్న : కొన్ని చోట్ల పురుషులు సేవకు సమర్పించుకున్నవారు లేకపోతే ఎలా? ఇప్పటికి కొంతమంది పెద్దవాళ్ళు, నేను కొన్ని పెళ్ళిలు చేసాను, ప్రసంగాలు చేసాను. అని చెప్పిన స్త్రీలు కూడ కొందరున్నారు, వృద్ధులు! ఇలాంటి పరిస్థితిలో ఎలా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు : ఇప్పుడు అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టు ఊరకున్నాడని బైబిల్లో అపోస్తలుల కార్యాలు 17:31వ వచనంలో ఉంది. అది అన్ని సూత్రాలకు వర్తిస్తుంది. కొంతమందికి ముంచడం బాప్తిస్మమే కరెక్టని తెలియక అజ్ఞాన దశలో చిలకరింపు తీసుకున్నారు. చిలకరింపు పొందినోళ్ళందరూ నరకానికి వెళ్తారని నేను చెప్పలేను. ఎందుకంటే ముంగమూరి దేవదాసు అయ్యగారు, చిలకరింపు పొందారు, చిలకరింపు ఇచ్చారు. మరి ఆయన పరమ భక్తుడు, శ్రేష్ట భక్తుడు! మరి ఆయన నరకానికి వెళ్తాడని నేను చెప్పగలనా? అసలు మనం పొయ్యెదే అనుమానం అని చెప్పకోవచ్చు గాని, ఆయన బొయ్యేది అనుమానం అని మనం చెప్పలేం. ఆయన మహాశ్రేష్ట భక్తుడు. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాం. వారి అడుగుజాడల్లో నడువడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ లెక్కన జాన్వెస్లీ, మార్టిన్ లూథర్ చిలకరింపు గనుక అజ్ఞాన దశ అనేది ఉన్నప్పుడు ప్రతిఒక్కరికి వ్యక్తిగతమైన అజ్ఞాన దశ ఉంటుంది. ఆయా విషయాల పరిధిలో అజ్ఞాన దశ ఉంటుంది. కొంతమందికి బాప్తిస్మము సంగతే తెలియదు. అంతవరకు వారు ఇగ్నోరెంట్ (Ignorant) కొంతమందికి పరిశుద్ధాత్మ వరాల సంగతి తెలియదు. మిగతావన్ని మహా పండితుల ఆత్మవరముల విషయంలో ఇగ్నోరెంట్.
కనుక తెలియక ఎవరైతే తప్పు చేస్తే, దేవుడు కనికరిస్తాడు. తెలిసినా కూడ ఎంత కన్విన్స్ చేసినా కూడ మొండికేసి, వితండవాదం చేసి తిరుగుబాటు చేసినవాళ్ళకు మాత్రం శిక్ష ఉంటుంది.
సేవకులు లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం చేతులెత్తి దేవుణ్ణి స్తుతిద్దాము. అని ప్రసంగం చేస్తాము, బైబిల్ లో వచనం కూడ ఉంది. ఒకడికి యుద్ధంలో రెండు చేతులు తెగిపోయినాయి, వాడెలాగ దేవుణ్ణి స్తుతించాలి? Any rule is applicable, where there is a possibility సాధ్యం అయినప్పుడు రూల్ అప్లై అవుతుంది. సాధ్యం కానప్పుడు రూల్ అప్లై కాదు. కాని అప్పుడున్న స్త్రీలు, అవసరాన్ని బట్టి నడిపిస్తున్న స్త్రీ కూడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఇప్పుడు జరుగుతున్నది సరైన క్రమము కాదని మాకు తెలుసు. కాని నీవు కనికరించి ఈ అక్రమమును సరిచేసుకోడానికి మాకు సహాయము చేయమని వారు నిజంగా కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మార్గం తెరుస్తాడు. అలాగు జరిగిన సంఘాలుకూడ నాకు తెలుసు ప్రారంభంలో అక్కడ ఎవ్వరూ లేరు గనుక ఒక అమ్మగారు నడిపించి తరువాత దేవుడు పంపిన ఒక దైవజనుడు వచ్చినాక, నాయనా ఇంతకాలము నేను గత్యంతరం లేక నడిపించాను. ఇప్పటినుండి మీరు నడిపించండి. అని అప్పగించిన మహా తల్లులను నేను చూసాను.