(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న అడిగినందుకు కృతజ్ఞతలు. సకల ప్రజలకు నా సమాధానమిదిగో, వేదములలో యేసును గూర్చిన సాక్ష్యం వ్రాయబడి ఉన్నది అని నేను చెప్పడం ఏదో ఒక విధంగా ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వైషమ్యాలు, ద్వేషపూరిత భావాలు అనేది సద్దుమణిగి పోవాలి. ఈ శత్రుత్వం వైరం అనేది తొలగిపోయి సౌభ్రాతృత్వం ఏర్పడాలి. గనుక ఏదో రకంగా కలిపేద్దాం, సర్దిచెప్తాం అనే ఉద్దేశ్యం మాత్రమే కాదు. నేను వ్యక్తిగతంగా నమ్ముచున్నాను. అది ఏంటంటే ఋషులు, వేదాలు రాసేటప్పుడు దేవుడు మధ్యలో అక్కడక్కడా జోక్యం చేసుకొని కొన్ని సంగతులు వ్రాయించాడు అని నేను నమ్ముతున్నాను. మీరు ఎత్తి చెప్పిన లేఖం 1 పేతురు 2: 20, 21 ప్రకారం “ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను” మనుషులు పరిశుధ్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి, అంటే మనుష్యుని ఊహను బట్టి బైబిల్ గ్రంథం వ్రాయబడలేదు. అంటే మిగతా గ్రంథాలు మనష్యుని ఊహను బట్టి వ్రాయబడినాయి అనే గదా అర్థం. పౌలు భక్తుడు కూడా మనుష్యుల చమత్కార కల్పనలను అనుసరించి మేము మీకు సువార్తను చెప్పలేదంటారు. పేతురు భక్తుడు కూడా అంటాడు. మేముమానవ జ్ఞానాన్ని బట్టి కాదు పరిశుద్ధాత్మ ద్వారానే సువార్తను బోధించాము అని పౌలు కూడా 1 కోరింథి 2:1-5 పచనాలలో చెప్పాడు. గనుక బైబిలేతర (Extra bibilcal, Non-Biblical ancient so called Holy literatures) అంతా కూడా మానవ చమత్కారం, మానవ జ్ఞానం అన్నట్లుగా అన్యాపదేశంగా (ఇన్ఫ్రారెక్ట్గా) బైబిల్లోని భక్తులు చెబుతుంటే నీకు అది ఎందుకు కావాల్సి వచ్చింది అందరు అడుగుతున్న దానికి నేను చెబుతున్నాను. నా స్ట్రాంగెస్ట్ కన్విక్షన్, నేను చెబుతున్నాను. ఇది కాదని ఎవరైనా చెప్పగలిగితే నా కన్విక్షన్ వదులుకుంటా, అంతా రిస్క్ తీసుకుంటున్నాను. అది ఏంటంటే, బైబిల్ లోని ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి సున్న, పొల్లు, కామా, ఫుల్ స్టాప్ ప్రతీది కూడా పరిశుద్ధాత్మ దేవుడు డిక్టేషన్ చేసి వ్రాయించాడు అని నేను స్ట్రాంగ్గా నమ్ముచున్నాను. ఇతర గ్రంథాలన్ని ఏవి కూడా అంతగా సంపూర్ణమైన దేవుని ప్రేరేపణతో వ్రాయబడలేవు. అయినప్పటికీ మానవులు తమ అన్వేషణ ఫలితాలు, తమ పరిశోధనా ఫలితాలు, తమకు కలిగిన దార్శనికత, తమకు కలిగినటువంటి మానసిక సత్య ప్రత్యక్షతలను మహర్షులు వ్రాస్తున్నపుడు దేవుడు జోక్యం చేసుకొని కొన్ని మాటలు, బైబిల్ లో ఉన్న సత్యాలు, బైబిల్ లోని దేవుని గూర్చి గ్రహించడానికి అవసరమైన సత్యాలు ఇతర గ్రంథాలలో కొన్ని వ్రాయించాడు అని నేను నమ్ముచున్నాను.
నన్ను వ్యతిరేకించే వారందరిని, నా విమర్శకులను నేను అడుగుచున్న ఒక్క ప్రశ్న నేను వేస్తున్న ఛాలెంజ్ హిందూ సనాతన శాస్త్రాలలో మేఘములలో ఏర్పడేటటువంటి ఏడు రంగులు విల్లు, దాన్ని ఒక వైపు హరివిల్లు అని పిలుస్తారు. కాని అంతకుముందు దాన్ని ఇంద్రధనస్సు అని పిలిచేవారు. ఇంద్రధనస్సు అంటే ఇంద్రుడు అంటే దేవతలకు రాజు, దేవతలకు రాజు యొక్క ధనస్సు అని హిందువులు చెప్తున్నారు. ఇదేమాట బైబిల్లో లో కూడా ఉన్నది. నోవహు జల ప్రళయ కాలంలో దేవుడు మేఘములో నా ధనస్సును ఉంచితిని అని అంటాడు. దయ చేసి ఆదికాండము 9:13-17 చదవండి. దేవుడు మేఘములో నా ధనస్సును ఉంచితిని అని ఎందుకు అన్నాడు. ఇదే మాట హిందు సనాతన ధర్మంలో వర్షం వచ్చినప్పుడు కనబడే ఆ బోవ్, ఆ ధనస్సు (ఆ ఏడు రంగుల విల్లు)ను మన హిందువులు ఇంద్రధనస్సు అని ఎందుకు అన్నారు? ఈ కొట్టివచ్చినట్టు సిమిలారిటి ఎందుకు ఉన్నది?
ఇది ఆదికాండంలో కనబడుతుంది. ఇది మోషే వ్రాసాడని బైబిల్ చెబుతుంది. మోషే వ్రాసాడనేది జగతి విధితమే మోషే జీవించిన కాలం బి.సి. 1500 ఏండ్లు. బి.సి. 1500 ఏండ్ల నాడు మోషే జీవించి ఈ సంగతి వ్రాస్తే అంతకన్నా కనీసం కొన్ని వందల సం॥లకు ముందే వేదాలు ఉన్నది. గనుక బైబిల్ కంటే ముందు వేదాలు వ్రాయబడాయని పాశ్చాత్య పండితులతో సహ అందరు ఒప్పుకుంటున్నదే. మరి వేదములను చూసి, బైబిల్ రచయిత కాపీ కొట్టినట్లా? లేక బైబిల్ను చూసి వేద ఋషులు కాపీ కొట్టినట్లా? లేక ఒకరినొకరు కాపీ కొట్టుకునేటట్లు వారికి సహజీవనం కలిగిందా? లేక ఎవరంతట వారే రాసారు కానీ అవే మాటలు రెండు చోట్ల దొర్లినయి అనుకోకుండా అని అనుకోవాలా? హెబ్రీ ప్రవక్తలు, భారతదేశానికి వచ్చి హైందవ సనాతన గ్రంథాలను చదివి కాపీ కొట్టారా? లేక భారతదేశ వేద ఋషులు ఆ దేశానికి (ఇశ్రాయేలు దేశానికి) వెళ్ళి బైబిల్ని చదివి కాపీ కొట్టారా? ఇలాంటి అవకాశం ఉందా? ఇలాంటి అవకాశం లేనప్పుడు దేవుని ఆత్మ ఇద్దరిని ప్రేరేపించి అవే మాటలను వ్రాయించాడు అని అర్ధం చేసుకొనే విషయంలో మనకు అభ్యంతరం ఏమిటి? రెండు చోట్ల ఒకటే వ్రాసి యేసు అనే ఆ చారిత్రక పురుషునికి వేరుగా ఇంకొకని వైపుగా నడిపిస్తే క్రైస్తవులు బాధపడాలి. యేసుక్రీస్తు అనే హిస్టారిక్ పర్సన్ ఉన్నాడు. అశోకుడు, విక్రమాదిత్యుడు, అక్బర్, బాబర్, శివాజి అనే వాళ్ళు చరిత్రలో ఎలా ఉన్నారో వాళ్ళ లాగా యేసుక్రీస్తు ఉన్నాడు. నీలాగా, నాలాగా ఒకప్పుడు ఈ భూమి మీద జీవించి ఉన్నాడు. ఆయన యజ్ఞమై తిరిగి లేచాడు. ఆయనను గూర్చిన వర్ణనలు వేదాలలో, బైబిల్లో సమానంగా వ్రాయబడ్డాయి. కనుక ఆయన వైపు నడిపించడానికి ఈ రెండు గ్రంథాలలో ఉన్న సిమిలారిటీ ఉపయోగపడినప్పుడు క్రైస్తవులు బాధపడవలసిన అవసరం ఏమిటి? సంతోషించాలి యేసు అంటే ఇష్టం లేని వాళ్ళు బాధపడవచ్చు. ఏంటండి రెండు గ్రంథాలు కలిపి ఆయనే దేవుడంటున్నారు. అని వాళ్ళు బాధపడితే అది అర్ధం చేసుకోవచ్చు. కాని యేసు అంటే ఇష్టం కలవారు మేము నిరూపిస్తుంటే ఎందుకు బాధపడాలి?
కాబట్టి దేవుడే జోక్యం చేసుకొని, ఆ గ్రంథాలలో ఆయనను గురించిన కొన్ని మాటలు వ్రాయించాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేనే కాదు. ఏ.బి. మాసిలామణిగారు అదే మాట వ్రాసారు. “యేసే ప్రజాపతి పరమేశం” అని వ్రాసారు. రండి సువార్త సునాదముతో అనే పాటలో అలా ఎందుకు వ్రాసాడు. వేదములలో వ్రాయబడిన ప్రజాపతి ఎవరైతే ఉన్నారో, ఆ వర్ణనలు, లక్షణాలు యేసులో ఉన్నాయి. కాబట్ట యేసే “ప్రజాపతి పరమేషం” అని మాసిలామణి గారు చెప్పారు. ఆయనేం అమాయకుడా, వేదంతం ఎరుగని వాడా? ఆయన కంటే వీళ్ళు ఎక్కవ తెలిసినవాళ్ళా?
గనుక యేసుని గూర్చిన వర్ణనలు హిందూ మతగ్రంథాలలో ఉన్నాయి. ఆ గ్రంథాలలో అభిమానించే వారు యేసుని గురించి ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఆలోచించి చనిపోయినప్పుడు యేసు దగ్గరకు వస్తారు. లేదంటే దూరమైపోతారు.
నేను చెప్తున్నదేంటంటేBible is word of God, and other books have some words of God. బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి సున్న, అర సున్న, పొల్లు, కామా, ఫుల్స్టాప్ ప్రతీది కూడా పరిశు ద్దాత్మ దేవుడు శ్వాస ఊది వ్రాయించాడు. కాని ఇతర మన గ్రంథాలను కవీశ్వరులు వారి మనస్సులో స్ఫురించిన మాటలను వ్రాస్తున్నప్పుడు యెహోవా దేవుడు అప్పుడప్పుడు, అక్కడక్కడా జోక్యం చేసుకొని ఆయనను గురించిన కొన్ని మాటలకు వ్రాయించుకున్నాడు. కాబట్టి పౌలు ఏథేన్సు వారికి యేసును ప్రకటించేటప్పుడు వారి మత గ్రంథాలను గూర్చి మాట్లాడుతూ మీ కవీశ్వరులలో కొందరు ఈలాగు చెప్పుచున్నారని ప్రకటించాడు. కాబట్టి బైబిల్ మాత్రం దేవుని వాక్కు ఇతర గ్రంథాలు సాతాను గ్రంథాలు అనే డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ లేదు. పైపెచ్చు పౌలు యొక్క సువార్త ప్రకటన విధానంలో ఇతర మతగ్రంథాలలో యేసును గూర్చిన మాటలను వాడుకోవచ్చు అని కూడా అర్ధమౌతుంది.