92. ప్రశ్న: మత్తయి 16:19, మత్తయి 18:18 ఈ రెండు వచనాలకు తేడా ఏంటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మీరు కరెక్టుగా లైన్లోనే ఉన్నారు. ఆదే ఆలోచన ప్రయాణంలో, యాత్రలో, పరిశోధనలో ఇంకొక నాలుగు అడుగులు వేస్తే మీరు కరెక్టుగా జవాబులోకి వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే 18వ అధ్యాయంలో ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ నేను వారి మధ్యలో నేనున్నాను అని చెప్పినటువంటి సందర్భము. 16వ అధ్యాయము పేతురుకు చెప్పినట్వంటి మాట. అంటే పేతురుకు ఏ మాట చెప్పాడో, 18వ అధ్యాయంలో సంఘానికి అదే మాట చెప్పాడు. మరి పేతురు అనే మాటే, ఒక రాయి అని అర్థం ఇచ్చే మాట! పేతురనగా మూలభాషలో ఒక రాయి. ఆ పేతురే మనకు 1పేతురు 2వ అధ్యాయంలో మీరు సజీవమైన రాళ్ళు అని రాసాడు. సీమోను బరియోనా అంటే యెహాను కుమారుడైన సీమోను. సీమోనుకు దేవుడు పేతురు అని పేరు పెట్టాడు. పేతురు అనే పేరు పేతురే మనకందరికి పెట్టాడు. గనుక పేతురొక సజీవరాయి. మనమందరము సజీవరాళ్ళము. గనుక ఒక్క సజీవరాయికి యేసు ప్రభువు వారు ఏ అధికారం ఇచ్చారో, ఆయన సజీవరాళ్ళందరికి అదే అధికారం ఉన్నట్లు ప్రకటిస్తున్నాడు. పేతురు మనకన్న స్పెషల్ వ్యక్తి ఏమీ కాడు. ఇప్పుడు రోమన్ కాథోలిక్ సిద్దాంతము, Peter is the first Pope అని. పేతురే మొట్టమొదటి పోపు. ఆ తరువాత పోపుల పరంపర స్టార్ట్ అయ్యిందని రోమన్ కాథోలిక్ సిద్ధాంతం. అట్లయితే మనందరం పోపులం కావాలి. ఎందుకంటే పేతురుకున్న అధికారాలు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని ప్రార్ధన చేస్తారో ఆ విశ్వాసులందరికీ ఉన్నాయి. ఇక్కడేంటంటే పరలోకరాజ్యపు తాళపు చెవిలు గలిగి దేన్నైనా బంధించగలిగి, విప్పగలిగిన అధికారం. ఆ శక్తి ఎవరికి వస్తుందంటే 16వ అధ్యాయంలో చెప్పారు. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచెనేగాని రక్తమాంసములు నీకు బయలుపరచలేదు సీమోనుబరియోనా నీవు ధన్యుడివి.
నీవే జీవముగల దేవుని కుమారుడవైన పరిశుద్ధుడవు అని అన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువు ఎవరో ఆ ప్రత్యక్షత పొందినవాళ్ళకు ఈ అధికారము, హక్కు ఉంటుంది. చీకటి శక్తులను బంధించేహక్కు ఆ సైతానుగాడు బంధించిన వారి బంధకాలు విప్పేహక్కు, అధికారం ఎవరికుంటుదయ్యా అంటే, ఎవడో పైనుండి ఊడిపడనక్కరలేదు. ఆదాము పిల్లల్లో పుట్టినా సరే, మనోనేత్రాలు వెలిగించబడి యేసు ఎవరో గ్రహించగలిగే దర్శనం పొందినవాళ్ళందరికి, ఆత్మల ప్రపంచము మీద ఈ విశేష అధికారం సంక్రమిస్తుంది. అదీ విషయం.