98. ప్రశ్న: శరీరానికి దెబ్బతగిలితే మనిషిలోని ఆత్మా, ప్రాణం వెళ్ళిపోవటం ఏంటి? ఇప్పుడు, అకాల మరణాలు చాలా ఆశ్చర్యంగా జరుగుతున్నాయి, దానికి కారణాలు వివరించగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మొట్టమొదటిగా, శరీరానికి దెబ్బతగిలితే మనిషిలోని ఆత్మ, ప్రాణం వెళ్ళిపోవటం ఏంటి అని అన్నారు. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు మనిషిలోంచి ఆత్మ వెళ్లిపోదు. మామూలుగా చిన్నప్పుడు మా స్కూలు మాస్టరు కొడతారు, అమ్మ నాన్న కొడతారు, మనం క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటాం. ఎన్నో గాయాలు మన శరీరానికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మరప్పుడంతా ప్రాణం పోలేదే? ప్రాణం ఎప్పుడు పోతుందంటే ఆయువుపట్లు అనేవి మనకు కొన్ని ఉన్నాయి. ఆ ఆయుపుపట్టు మీద దెబ్బ తగిలినప్పుడు ఏం జరుగుతుందంటే: మన శరీరము ఆత్మ నివసించడానికి ఉన్నట్వంటి ఒక ఇల్లు. ఒక వ్యక్తి ఉండటానికి మన శరీరము ఒక ఇల్లు. ఇప్పుడు ఆ శరీరము ఒక నివాసముగా ఉండటానికి, వీలులేనంతగా డ్యామేజ్ అయినప్పుడు ఆ లోపలున్న ఆత్మ వెళ్ళిపోతుంది. For example మన ఇల్లు, మనమొకరికి అద్దెకిచ్చాం. అద్దెకిచ్చినప్పుడు రాత్రికి రాత్రి తుఫాను వచ్చేసి ఇంటిపైన కప్పు అమాంతం వెళ్ళిపోయిందనుకోండి. కప్పు లేకుండా వాడు ఇంట్లో ఎంత సేపు ఉంటాడు? ఆ ఇల్లు రిపేర్ అయ్యిందాక నేను ఇంకో ఇంట్లో ఉంటానని చెప్పి, వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి, దీన్ని రిపేర్ చేసుకుంటాడు. అలాగే మనము నివసించడానికి ఇల్లు అనువు కాకుండా ప్రతికూలంగా, అసౌకర్యంగా, ఉండేటట్లు ఎప్పుడు డ్యామేజ్ అయిపోయిందో, అప్పుడు లోపలున్న మనిషి. ఆ యింటిని వదిలేసి వెళ్తాడు. ఇది మొదటి విషయం.

రెండవ విషయం, ఎక్కువగా గాయం తగిలినప్పుడు రక్తం స్రవిస్తుంది. రక్తము కారి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనం కుర్చిలో కూర్చునట్టు, రక్తం మన దేహములో కూర్చునే సీటు అన్నమాట! లేవియాకాండము 17:11 లో రక్తమే దేహమునకు ప్రాణం. రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి మీ పాపమును ప్రాయశ్చిత్తము చేయునన్నాడు. గనుక ఇప్పుడు రక్తము ఏమి లేకుండా బయటకు వెళ్ళింది అనుకోండి, ప్రాణము కూర్చోడానికి సీట్ లేదు. నన్ను మీరు ఇంటికి పిలిచి కుర్చీ వేయకుండా, నిల్చోబెట్టి మాట్లాడినట్టుగా ఉంటుంది. చాలా సేపు నాకు కుర్చీ వెయ్యకపోతే, మంచిది బాబు, నాకు వేరే పనుందని, వెళ్ళోస్తానని వెళ్ళిపోతాం. గనుక ఈ శరీరము ఒక ఇల్లు నివాసము, గృహము లోపలికి వచ్చినట్వంటి పౌరుడు, టెనెంట్. ఆ గృహములో ఉండటానికి అవకాశం లేకుండా, ఆ ఇల్లు డ్యామేజ్ అయిపోయినప్పుడు, తనకు కూర్చునే సీటు లేనప్పుడు ఆ ప్రాణం, ఆత్మ బయటకెళ్ళిపోతాయి. అకాల మరణాలు సంభవించడం అంటే అంత్య దినాలలో జరుగుతున్నట్వంటి వైపరిత్యాలు. జరుగగూడని ప్రకృతి విరుద్ధమైన సంగతులు ఎన్నెన్నో ఇప్పుడు జరుగుతున్నాయి కదా? అందులో ఇది కూడ ఒకటి, దానికి ఆధ్యాత్మిక మర్మం ఏముంది!