99. ప్రశ్న : ఇప్పుడు మీరు రాసిన గ్రంథంలో ఇరవైనలుగురు పెద్దలు, గొర్రెపిల్ల యొక్క రక్తము క్రిందకు రారు అని! చెప్పారు సారు! ఇక్కడ నా కొచ్చిన డౌట్ ఏంటంటే, కోలస్సీయులకు 1:19-20 వచనాల్లో యేసు రక్తం, పరలోకమందున్నవైననూ, భూలోకమందున్నవైనను యేసు రక్తం చేత సంధిచేయబడ్డాయి కాబట్టి. వీరు రారా? వస్తారా? వీళ్ళకు యేసు రక్తం అవసరం లేదా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అసలు మీరు మొత్తము రివర్సులో ప్రశ్న అడుగుతున్నారు. పరలోకమందు దేవదూతలకు విశ్వంలోని అన్ని కోటానుకోట్ల ప్రపంచాల పౌరులకు యేసు రక్తం కావాలి. అని నేను వందలసార్లు చెప్పాను. అంతేకాని పరలోకవాసులకు యేసురక్తం అక్కర్లేదని నేనెప్పుడు చెప్పానండీ? ఇరవైనాలుగురు పెద్దల దగ్గర, యేసురక్తం సంగతి అనలేదే, వాళ్ళు సంఘం కాదు అని చెప్పాను. ఎందుకు సంఘము కాదు అంటే, ఇప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు, 12గురు అపోస్తలులు, 12గురు గోత్రకర్తలు. 24 అని పెద్దలు వ్యాఖ్యానం చెప్పారు. ఆ పన్నెండుగురు ఈ పన్నెండుగురు మొత్తం ఇరవై నలుగురు కాబట్టి, అందులో ఒక సీటు ఖాళీగా ఉండాలి, ఎందుకంటే దర్శనం చూసేవాడే యోహాను కాబట్టి. మరి ఈయన పోయి దెబ్బలాడాలి. అది మ్యాజికల్ సీట్లాగా ఉందిసార్, నాసీట్లో నువ్వెవరు కూర్చున్నావు అని దెబ్బలాడాలి. వాళ్ళెప్పుడో భవిష్యత్తులో ఉండబోయే ఊహజనితమైన వ్యక్తులు కాదు. రైట్ నౌ, యోహాను చూస్తున్న టైంలోనే, పెద్దల్లోని వారు ఒకరొచ్చి, యెహానును ఓద్దార్చారు. ఏడ్వకని చెప్పాడని ఉంది. గనుక యోహాను దర్శనాలను చూస్తున్న కాలంలోనే వీళ్ళు సింహాసనాలమీద ఉన్నారు. యోహానుతో మాట్లాడారు, ఏడవద్దాన్నారు. కాబట్టి వాళ్ళు సంఘం కాదు. వాళ్ళు దేవదూతల్లో, ప్రధానులు అనే విషయం నేను చెప్పాను. అంతేగాని యేసు రక్తం అందరికి కావాలి ఇరువదినలుగురు పెద్దలకు కూడ యేసురక్తం కావాలి. యేసురక్తం అనేది విశ్వానికి అవసరం గనుకనే యేసు పుట్టినప్పుడు పరలోకవాసుల సైన్యసమూహము వచ్చి ఆనందగానాలు చేసారు. ఈయన పుట్టి, బలికావడం ద్వారా వాళ్ళకీ ప్రయోజనం ఉంది. అందుకే వాళ్ళు సంతోష గానాలు చేసారు.