(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చాలా మంచి ప్రశ్న ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇశ్రాయేలీయులు నా ప్రజలు అన్నారు కదా, దాని మీదనే నేను ఒక గ్రంథము రాయల్సినంత విషయం ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులు నా ప్రజలు, మిగతా వాళ్ళెవ్వరు నా ప్రజలు కాదు అని కాదు. అలా అనుకున్న దేవుడైతే భూదిగంతముల నివాసులారా. నావైపు చూసి రక్షణ పొందుమని ఎందుకంటాడు? యెషయా 45:22, లో కీర్తనలు 47 లో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని ఎందుకంటాడు? అలాగే కీర్తనలు 100 సమస్తదేశములారా యెహోవాను బట్టి ఉత్సహించుడి అని ఎందుకంటాడు. అలాగే కీర్తనలు 50 తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరిని యెహోవ రమ్మని పిలుచుచున్నాడు అని ఎందుకంటాడు? అలాగ ఎన్నో వచనాలు బైబిలులో చాలా చూపించవచ్చు. గనుక ఇశ్రాయేలీయులు ఒక్కరే దేవుని ప్రజలు, మిగతా వాళ్ళ ఎవరు కాదు అని కాదు. మొదటి మాటకు మాత్రమే అర్థం చెప్తున్నాను. “ఇశ్రాయేలీయులు నా ప్రజలు” అంటే అర్థమేమిటంటే భూనివాసులందరిని ఇశ్రాయేలు అనే పేరుకు అర్హులుగా మార్చడానికి కంకణం కట్టుకున్న దేవుడు ఆయన. “ఇశ్రాయేలు” అంటే అర్థమేమిటంటే దేవునికి భయపడువాడు, దేవుని యందు భక్తి కలిగినవాడు, దేవునికి లోబడేవాడు, తన వేదనలో, తన బాధలో, తన సమస్యలలో, దేవుని పాదాలను పట్టుకొని కన్నీళ్ళతో ప్రార్థించేవాడు ఇశ్రాయేలు. “ఇశ్రాయేలు” అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం ఉన్నది బైబిలులో. పోరాడువాడు అంటే, మనం అమి తుమీ చూస్కుందాం అనే పగవాళ్ళ పోరాటం కాదు ప్రార్థనా పోరాటం. గనుక ఇశ్రాయేలు అనగా దేవుని చేత ఐగుప్తు దాస్యమునుండి రక్త బలముచేత, రక్త ప్రభావము చేత, రక్తప్రోక్షణ ప్రభావం చేత, విమోచింపబడినవాడు. ఇశ్రాయేలు అంటే విమోచించబడినవాడు, యేసుక్రీస్తు రక్తము ఆరోజుల్లో పాతనిబంధన గొర్రెపిల్ల రక్తము, పస్కా గొర్రెపిల్ల రక్తము, వారిని విమోచించినది సాదృశ్యం గనుక గొర్రెపిల్ల రక్తమందు విశ్వసముంచి, సంహారదూత ఖడ్గమునుండి విడిపించబడినవాడు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. గనుక ఇశ్రాయేలీయులు చేసే స్తోత్రాల మీద నేను ఆసీనుడనైయుంటాను అని అన్నాడు. అంటే భారతీయులు జపానీయులు ప్రార్థన చేస్తే అంగీకరించను అని కాదు. అన్ని దేశములలోను ఎవరైతే యేసురక్తం ద్వారా విమోచింపబడ్డారో వారు ఇశ్రాయేలీయులు. బైబిలులో తేటగా ఉంది ఆ మాట అసలైన ఇశ్రాయేలు ఎవరంటే ద్విజుడైన వాడు. నూతన జన్మ పొందినవాడు, నూతన సృష్టిగా మార్చబడ్డవారు. యేసుప్రభు రక్తంలో విమోచింపపడ్డవాడు ఇశ్రాయేలీయుడు. గనుక ఇశ్రాయేలీయులు నా ప్రజలు అంటే దానికి రివర్సులో ఉదా: మనదేశంలో కూడా వాయువు దేవుడు అన్నారు. అయితే వాయువు దేవుడు అంటే వాయువును చేసినవాడు దేవుడు. వాయుదేవుడు అంటే దేవుడు వాయువులాంటి లక్షణాలు కలవాడు, కనిపించకుండా అంతట ఉండడం. దేవుడు అగ్నిదేవుడు అన్నారు. అంటే దేవుడు ఈ అగ్నిని పోలినవాడు. అలాగే అన్నం, అన్నం పరబ్రహ్మాస్వరూపం అన్నారు. అంటే దేవుడు అన్నము వంటివాడు. అట్లాగే దేవుడు వర్షము వంటివాడు. అన్ని చోట్ల కురుస్తాడు, జీవనాధారంగా పంటలు పండిస్తాడు. కనుక దేవుడు అగ్నిలాంటివాడు, దేవుడు అన్నము, గాలి లాంటివాడు, దేవుడు సూర్యుడు లాంటివాడు. అంటే దేవుడిని మనం అర్థం చేసుకోవడానికి సూర్యుడు ఒక ప్రతీక, సూర్యుడు అన్నిదేశాలకు ఎట్లా వెలుగునిస్తాడో, ఒక రక్షకుడు అన్ని దేశాలకు రక్షణ ఇస్తాడు. ఈ ప్రతీకత్మాక సంగతులను అర్థంచేసుకునేటప్పుడు కొంచెం రివర్సు చేసి చూడాలి. గురుబ్రహ్మా, గురువిష్ణు అన్నారు. రేప్ చేసే గురువులు కూడా ఉన్నారు. వీడొక నక్షత్రం చేయగలడా? ఒక చచ్చిపోయినా బల్లిని, చీమను రక్షించగలడా? ఈ పాఠాలు చెప్పేవాడు దేవుళ్ళు అని కాదు. నక్షత్రాలను చేసిన దేవుడు మనకు గురువు ఆయనే పాఠాలు నేర్పిస్తాడు గనుక ఇవన్నీ రివర్సులో ఎలాగు అనుకున్నామో అలాగే ఇశ్రాయేలుకు నేను దేవుడను అంటే అర్థమేమిటంటే సకల జనులను ఇశ్రాయేలుగా మార్చి నేను సంరక్షిస్తాను. అంటే సకలజనులను నా రక్తము చేత విమోచించి, నా పాదాలుబట్టుకొని ప్రార్థనలో పెనుగులాడువారిగా మార్చి నేను రక్షిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నా ప్రజలు అనుకున్న వాళ్ళనే వదిలేసాడు అంటే వాళ్ళు భూలోకమంతా చెల్లాచెదరు అయిన తరువాత మళ్ళీ ఇశ్రాయేలు సమకూర్చబడతారు అని దేవుడు బైబిలులో స్పష్టంగా ప్రవచించాడు, ప్రవక్తల చేత చెప్పించాడు. అంత్యదినములలో వారిని మళ్ళీ సమకూరుస్తాను అనే వాగ్ధానం నెరవేరింది. యెహెజ్కేలు 37:12,13, 22 ఇశ్రాయేలు ఏర్పడకుండ చేయాలని విశ్వప్రయత్నం జరిగింది ప్రపంచ రాజకీయాల్లో. అయినా సరే దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఇవాళ ఒక ఇశ్రాయేలు దేశం అనేది ఉన్నది. ప్రపంచములో ఇశ్రాయేలుకు ఉన్నటువంటి చరిత్ర ఏ దేశానికి లేదు. రెండు వేల సంవత్సారాల పాటు వాళ్ళకు అడ్రస్సులేకుండా సమస్త దేశాలలోనికి చెదరగొట్టబడి రెండువేల యేండ్లు అయినాక మళ్ళీ సమకూర్చబడినపుడు వాళ్ళకు అదే భాష, సంస్కృతి, మతము, మత గ్రంథము ఉన్నది. మనము భారతీయులం ఎక్కడికి చెదిరిపోలేదు కాని ఒకప్పుడు భారతదేశంలో సంస్కృతం, దేవభాష పండితులభాష, ఇది అందరు నేర్చుకోవాలి, అన్నారు. ఇప్పుడు మనకు ఆ గ్రంథాలు, ఆ సంస్కృతి పోయింది అని వీళ్ళందరు గగ్గోలు పెడుతున్నారు. నీ దేశంలోనే ఉండి నీ సంస్కృతిని పరిరక్షించుకోలేకపోయావు. రెండువేల యేండ్లు కనబడకుండా చెదిరిపోయి అదే సంస్కృతిలో వాళ్ళున్నారు. ఒక మనిషి చచ్చిపోయి బ్రతికినట్లు, జాతిమొత్తం పునరుత్థానం చెందిన చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర. దేవుని నమ్మకత్వానికి ఋజువు. ఇశ్రాయేలు పట్ల దేవుడు అబ్రాహముకిచ్చిన వాగ్ధానం, దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తన మాటను నిలబెట్టుకొని సమకూర్చాడు. ఇవాళ యేసునందు విశ్వాసముంచిన వారికి కూడా దేవుడు అదే విశ్వసనీయతను, నమ్మకత్వాన్ని తప్పకుండా చూపిస్తాడు. మనపట్ల కూడా అంతే నమ్మకంగా ఉంటాడు. అనేది బైబిలు సందేశం.