228. ప్రశ్న : కీర్తనలు 95:10లో “ నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని” 11లో “కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని” అని ఉంది అయితే అపో 13:18లో “యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను”. అని ఉంది. వినుగడం, సహించడం వేరు పదాలు కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      నలువది ఏండ్లు వారి చేష్టలను సహించెను అంటే వారి చేష్టలు ఆయనకు ఆనందకరంగా ఉంటే సహిస్తాడా? బాధకరంగా ఉంటే సహిస్తాడా? సంతోషకరంగా ఉంటే సహించడం ఉండదు. బాధకరంగా ఉంటేనే సహించడం.గనుక బాధకరమైన చేష్టలు చేస్తూనే ఉన్నారు. అయితే నలభై ఏండ్ల తరువాత ఆయన కోపించి మీరెన్నడూ ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశించకూడదని, మీ పిల్లలే వెళ్తారు తప్ప మీరు వెళ్లరని అన్నాడు. దేవునికి మన చర్యలు, పద్ధతులు, ఆలోచనలు బాధకరంగా ఉన్నప్పటికీ ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ఆయన కోపము అగ్నిలాగా మండి ఉంటే అప్పటికప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా భస్మం అయిపోవాల్సింది.  అసలు బంగారు దూడను చేసుకున్నప్పుడే ఆయన నాశనం చేస్తా అన్నాడు మోషే ఒద్దు ప్రభువా అని అన్నాడు. ఎప్పటికప్పుడు దేవుడు కోపాన్ని అణుచుకుంటూ, కనీసం వీళ్లు చేరకపోయినా కనానులో ప్రవేశించే కొత్త తరానికైనా వీళ్లు జన్మను ఇవ్వాలి. గనుక అంత బాధపడుతూనే ఉన్నా వాళ్లని పోషించాడు. అదే దేవుని మనస్తత్వం.